మీ మాట సబ్ స్క్రిప్షన్
కార్తీకమాస విశిష్ఠత

ఏ మానవుడైననూ యే వయసువాడైననూ 'ఉచ్ఛ- నీచ' అనే భేదము లేక కార్తీకమాసములో, సూర్యభగవానుడు తులారాశియందుండగా, వేకువజామున లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానమాచరించి, దానధర్మములును, దేవతాపూజలను చేసినచో - దానివలన అగణీత పుణ్యఫలము లభించును. కార్తీకమాస ప్రారంభమునుండియు, యిట్లు చేయుచు, విష్ణు సహస్రనామార్చన, శివలింగార్చన ఆచరించుచుండవలెను. ముందుగా కార్తికమాసమునకు అధిదేవత యగు దామోదరునికి నమస్కరించి " ఓ దామోదరా ! నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానీయక నన్ను కాపాడుము " అని ధ్యానించి , వ్రతమును ప్రారంభించవలయును.

కార్తీకమాస వ్రతవిధానము

శ్రీమహావిష్ణువునకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయముగా కోసి తెచ్చి నిత్యధూప, దీప, నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకొని గంధము తీసి భగవంతునికి సమర్పించి, తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిధి అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదమిడి తనయింటివద్దగాని, దేవాలయములో గాని, లేక రావిచెట్టు మొదటగాని కూర్చుండి కార్తీక పురాణము చదువవలెను. ఆ సాయంకాలము సంధ్యావందనమాచరించి, శివాలయమందు గాని, విష్ణ్వాలయమందు గాని, లేక తులసికోటవద్ద గాని, దీపారాధనచేసి శక్తిని బట్టి నైవేద్యము తయారు చేయించి, స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజింపవలెను. మరునాడు మృష్టాస్నానముతో భూతతృప్తి చేయవలెను. ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీపురుషులకు పూర్వమందును, ప్రస్తుతజన్మనందును చేసిన పాపము పోయి మోక్షమునకర్హులగుదురు. ఈ వ్రతము చేయుటకు అవకాశములేనివారులు వ్రతము చేసినవారలను జూచి, వారికి నమస్కరించినచో వారికి కూడ తత్సమాన ఫలము దక్కును.

కార్తీక స్నానవిధానము :

ఈ వ్రతమాచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి, కాలకృత్యములు తీర్చుకొని, నదికి బోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణునకు, పరమేశ్వరునకు, భైరవునకు నమస్కరించి, సంకల్పము చెప్పుకొని, మరల నీటమునిగి సూర్య భగవానునకు అర్ఘ్యప్రదాన మొసంగి, పితృదేవతలకు క్రమప్రకారముగా తర్పణములొనర్చి, గట్టుపై మూడు దోసిళ్ళు నీళ్ళు పోయవలెను. ఈ కార్తీకమాసములో పుణ్యనదులైన గంగ, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మున్నగు నదులలో యే ఒక్క నదిలోనైననూ స్నానమాచరించినయెడల గొప్పఫలము కలుగును.

Samputi.com is a collection of Telugu Literature, Hindu/Indian Rituals and a tradition of Telugu/Andhra Living. Current content includes. Satakams, Childrens' Rhymes, Festivals, Rituals and Dictionary.
కార్తీక మాస వ్రతము విశిష్ఠత పూజ విధులు దాన జప విధులు స్నానవిధానము కార్తికపూరాణము